Thursday, February 24, 2011

వ్రతం చెడ్డా దక్కని ఫలితం

ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకంలో జరుగుతున్న జాప్యం, నిధుల కొరత...ఎస్సీ, ఎస్టీ,బిసి, ఇబిసి విద్యర్థుల వ్యథ... వెరసీ కాంగ్రెస్ ప్రభుత్వం - ఇటీవల ఆ పార్టీ నుండి బయటపడిన జగన్ మధ్య జరిగిన వార్... ‘‘ఫీజు పోరు’’.

ఫీజు రీఎంబర్స్మెంట్ పథకంలో చోటుచేసుకున్న లొసుగుల ఫలితంగా వరలక్ష్మి అనే విద్యార్థిని ఆత్మహత్య అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నెల 18 నుండి 24వరకు జగన్ ఫీజుపోరు దీక్ష సాగింది. ఈ దీక్షను పరిశీలించినప్పుడు... గతంలో జరిగిన కొన్ని దీక్షలకంటే నికార్సుగా జరిగిందనే చెప్పాలి. దానికితోడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి ఈ వారం రోజులూ విద్యార్థులు వస్తూనేవున్నారు. మొదటి రోజున, చివరిరోజున భారీగానే జనం వచ్చారు. ముగింపు సభలో జగన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని హెచ్చరికలు కూడా చేశాడు. వారం రోజులు కఠిన నిరాహారదీక్ష సాగినా, ప్రభుత్వం తరఫునుండి దూతలు ఏ ఒక్కరూ రాకపోవడం జగన్ వర్గం నేతలను కలచివేసింది. ఈ విషయం వారి ప్రసంగాల్లో స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ వారి దీక్ష విజయవంతం కావడంతో సంతోషంగానే వున్నారు.

ప్రభుత్వ పరంగా చూసినప్పుడు... గతంలో నిరాహారదీక్షలు ఎంతో మంది చేశారు. వారందరినీ మంత్రులు, ఆ పార్టీలోని ప్రముఖులు పరామర్శించడం, దీక్షలు విరమించమని కోరడం వంటి సంఘటనలు అనేకం జరిగాయి. అయితే జగన్ విషయంలో ఇది జరగకపోవడం వెనుక వారి ఆంతర్యం ఏమిటో సుస్పష్టం. జగన్ దీక్షకు ప్రభుత్వం దిగివచ్చింది అనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళకూడదనేది కావచ్చు. సంప్రదింపులు జరపడం, దూతలను పంపడం వంటివి చేయడం ద్వారా జగన్ ఇమేజ్ ని మరింత పెంచకూడదని కూడా అనుకొనివుండవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ విషయంలో ప్రభుత్వం మొండివైఖరిని అవలంభించింది.

ఈ దీక్ష వల్ల జగన్ పెద్ద ఎత్తునే లబ్ది పొందాడని చెప్పవచ్చు. విద్యార్థుల్లో అతనో హీరో అయిపోయాడు. ప్రభుత్వం పంతానికి పోయి కనీసం అతన్ని పరామర్శించకపోవడం వల్ల కొంతవరకు నష్టపోయిందనే చెప్పాలి. దీనివల్ల ప్రజల్లో జగన్ పట్ల సానుభూతి వ్యక్తమైంది. ప్రభుత్వం నుండి ఎవరూ రాలేదనేది తప్ప ఈ పోరులో ఖచ్చితంగా జగనే విజేత. వ్రతం చెడ్డా ఫలితం దక్కకపోవడంతో తలలు పట్టుకోవడం ప్రభుత్వం వంతైంది.

No comments:

Post a Comment