Saturday, February 26, 2011

అపర చాణుక్యుడు ఎక్కడ?

అపర చాణుక్యుడుగా, తెరవెనుక మంత్రాంగం నడపడంలో దిట్టగా, వైఎస్ఆర్ కు ప్రాణమిత్రుడుగా రాష్ట్రప్రజలకు చిరపరిచితుడు కెవిపి రామచంద్రరావు ఎక్కడున్నారు? రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో వున్న ఈ సమయంలో ఆయన చాణక్యం ఎందుకు పనిచేయడంలేదు? అనేది ప్రతి సగటు మనిషికి వచ్చే అనుమానం. ఓ పక్క తెలంగాణ ఉద్యమం, మరోపక్క జగన్ వర్గం ఏ సమయంలో ఏం చేస్తుందోననే భయంతో కాంగ్రెస్ రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలు సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెరవెనుక చక్రం తిప్పుతూ అననుకూల పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చగల ఈయనగారు ప్రస్తుతం ఏమైనట్టు.

ఇదంతా ఒక ఎత్తైతే జగన్ పట్ల కెవిపి వైఖరిని రాష్ట్రంలోని ప్రతి వైఎస్ అభిమానీ తప్పుపడుతున్నారు. అధిష్టానం జగన్ ను ఒంటరిని చేయడానికి ఏరకంగా ప్రయత్నించిందో అందరికీ తెలిసిందే. ఈ విషయం ఆయనకూ తెలుసు. ఇటువంటి సమయంలో తన ప్రియమిత్రుని కొడుకుని ఒంటరిగా ఒదిలేయడం ఎంతవరకూ సమంజసమని ప్రతి సగటు పౌరుడూ ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుత సమయంలో కెవిపి జగన్ వెన్నంటి వుండి, అతనికి సరైన మార్గనిర్దేశం వహిస్తూ వున్నట్లయితే నేటి పరిస్థితులు వేరుగా వుండేవి. అదే సమయంలో కెవిపి విలువ కూడా పడిపోయేది కాదు.

ఇటువంటి పరిస్థితిలో వైఎస్సే గనుక వుంటే- అంటే కెవిపి స్థానంలో వైఎస్సే వుంటే... కెవిపి కొడుకును ఎట్టిపరిస్థితిలోనూ ఒంటరిని చేసేవాడు కాదు. అందుకు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వైఎస్ సిద్ధపడేవాడు. కెవిపికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడని వైఎస్ బంధువులు ఆయనకు చెప్పినప్పటికీ వైఎస్ ఆ విషయాలను ఏమాత్రం పట్టించుకోలేదు సరికదా, కెవిపికిచ్చే ప్రాధాన్యంలో వీసమెత్తు కూడా తగ్గలేదు. అదే కెవిపికి వైఎస్ కు వున్న తేడా. తన స్నేహితుడు చనిపోగానే ఆ కుటుంబాన్ని ఒంటరిపాలు చేసి, ప్రతిపక్షాలు, వైఎస్ వ్యతిరేకులు వైఎస్ పై చేస్తున్న విమర్శలను సైతం పట్టించుకోకుండా తన తోవ తను చూసుకున్నాడు. కాంగ్రెస్ అధిష్టానమే కాదు... ఎవరితో తలపడైనా, ఏ పరిస్థితుల్లోనైనా జగన్ వెన్నంటి వున్నట్లయితే తన స్నేహితుని పట్ల కెవిపికున్న కృతగ్నతకు ప్రజలు హర్షించేవారు. ఆయన కీర్తి ‘బాపు-రమణ’ల స్నేహంలా వర్థిల్లి వుండేది. కానీ కెవిపి స్వార్థంతో వ్యవహరించి, తన స్నేహితునికే అన్యాయం చేసాడని వైఎస్ అభిమానులు విమర్శిస్తున్నారు. వైఎస్ మరణం తర్వాత కెవిపి డబుల్ గేమ్ ఆడాడని, అటు అధిష్టానంతోనూ, ఇటు జగన్ తోనూ సన్నిహితంగా వుండేందుకు కొంత ప్రయత్నించినా, అది వికటించింది. డబుల్ గేమ్ ఆడుతున్న కెవిపి వైఖరి నచ్చని జగన్ ఆయనకు దూరమయ్యాడు. కిరణ్ కుమార్ రెడ్డి కెవిపిని దూరంగా నెట్టేసాడు. రెంటికీ చెడ్డ రేవడైన కెవిపి సారు ప్రస్తుతం ఎక్కడున్నాడో.... ఏదేమైనా ఇప్పటికైనా కెవిపి కళ్ళు తెరవాలి. తన ప్రియ స్నేహితుని రుణం తీర్చుకునే అవకాశం ఇప్పటికీ వుంది.

Thursday, February 24, 2011

వ్రతం చెడ్డా దక్కని ఫలితం

ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకంలో జరుగుతున్న జాప్యం, నిధుల కొరత...ఎస్సీ, ఎస్టీ,బిసి, ఇబిసి విద్యర్థుల వ్యథ... వెరసీ కాంగ్రెస్ ప్రభుత్వం - ఇటీవల ఆ పార్టీ నుండి బయటపడిన జగన్ మధ్య జరిగిన వార్... ‘‘ఫీజు పోరు’’.

ఫీజు రీఎంబర్స్మెంట్ పథకంలో చోటుచేసుకున్న లొసుగుల ఫలితంగా వరలక్ష్మి అనే విద్యార్థిని ఆత్మహత్య అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నెల 18 నుండి 24వరకు జగన్ ఫీజుపోరు దీక్ష సాగింది. ఈ దీక్షను పరిశీలించినప్పుడు... గతంలో జరిగిన కొన్ని దీక్షలకంటే నికార్సుగా జరిగిందనే చెప్పాలి. దానికితోడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి ఈ వారం రోజులూ విద్యార్థులు వస్తూనేవున్నారు. మొదటి రోజున, చివరిరోజున భారీగానే జనం వచ్చారు. ముగింపు సభలో జగన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని హెచ్చరికలు కూడా చేశాడు. వారం రోజులు కఠిన నిరాహారదీక్ష సాగినా, ప్రభుత్వం తరఫునుండి దూతలు ఏ ఒక్కరూ రాకపోవడం జగన్ వర్గం నేతలను కలచివేసింది. ఈ విషయం వారి ప్రసంగాల్లో స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ వారి దీక్ష విజయవంతం కావడంతో సంతోషంగానే వున్నారు.

ప్రభుత్వ పరంగా చూసినప్పుడు... గతంలో నిరాహారదీక్షలు ఎంతో మంది చేశారు. వారందరినీ మంత్రులు, ఆ పార్టీలోని ప్రముఖులు పరామర్శించడం, దీక్షలు విరమించమని కోరడం వంటి సంఘటనలు అనేకం జరిగాయి. అయితే జగన్ విషయంలో ఇది జరగకపోవడం వెనుక వారి ఆంతర్యం ఏమిటో సుస్పష్టం. జగన్ దీక్షకు ప్రభుత్వం దిగివచ్చింది అనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళకూడదనేది కావచ్చు. సంప్రదింపులు జరపడం, దూతలను పంపడం వంటివి చేయడం ద్వారా జగన్ ఇమేజ్ ని మరింత పెంచకూడదని కూడా అనుకొనివుండవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ విషయంలో ప్రభుత్వం మొండివైఖరిని అవలంభించింది.

ఈ దీక్ష వల్ల జగన్ పెద్ద ఎత్తునే లబ్ది పొందాడని చెప్పవచ్చు. విద్యార్థుల్లో అతనో హీరో అయిపోయాడు. ప్రభుత్వం పంతానికి పోయి కనీసం అతన్ని పరామర్శించకపోవడం వల్ల కొంతవరకు నష్టపోయిందనే చెప్పాలి. దీనివల్ల ప్రజల్లో జగన్ పట్ల సానుభూతి వ్యక్తమైంది. ప్రభుత్వం నుండి ఎవరూ రాలేదనేది తప్ప ఈ పోరులో ఖచ్చితంగా జగనే విజేత. వ్రతం చెడ్డా ఫలితం దక్కకపోవడంతో తలలు పట్టుకోవడం ప్రభుత్వం వంతైంది.